Sunday, June 17, 2012

ఇంటి ముఖము తూర్పు లేక ఉత్తరము దిక్కుకు ఎందుకు ఉండాలి?


వాస్తుశాస్త్రము ప్రకారము ఇంటి ముఖద్వారము తూర్పు లేక ఉత్తరము దిక్కువైపు చూస్తుండాలి. ఇలా ఎందుకుండాలని  మనకు ప్రశ్న ఉదయించవచ్చు. కాని అనుభవ పూర్వకంగా తెలిసినదేమిటంటే వాస్తుశాస్త్రాన్ని  ఆధారంగా నిర్మించిన గృహాల వల్ల అనేక విధాలైన ప్రయోజనాలున్నాయని, అలా నిర్మించిన గృహాలు ప్రసన్నంగా మరియు ఆహ్లాదకరంగా ఉన్నాయని నిరూపితమైనది.

దక్షిణ భారదేశంలో ఈ విధానమైన గృహ నిర్మాణాలు ఎక్కువగా ఉంటాయి. వర్షాలు కురిసే విధానంగా గాలులు వీచే దిశ మరియు  సూర్యకాంతి ప్రసరించే దిక్కులను ఆధారంగా చేసుకొని వాస్తు గృహనిర్మాణ విధానాన్ని తెలుపుతుంది.

వాతావరణ కాలుష్యం వల్ల ఓజోన్ పొర ఇంకా క్షీణించే అవకాశం ఉన్నందున నిలలోహిత కిరణాలు సూటిగా భూమిని తాకడం వల్ల మానవులకు హానికలుగుతుంది. అదే మన ఇల్లు ఉత్తరం వైపుకు ముఖం కలిగి ఉన్నట్లయితే ఇంట్లోకి నీలలోహిత కిరణాలు ప్రవేశించే బెడద ఉండదు. అరుగుపై కూర్చోని బంధుమిత్రులతో ముచ్చటించుకోవడానికి అనుకూలంగా కూడా ఉంటుంది.

ఒకవేళ ఇంటి ముఖం తూర్పు దిశగా ఉన్నట్లయితే అరుగుపైన కూర్చోవడం  వల్ల  ఉదయపు సూర్యకిరణాలు విటమిన్ శాతాన్ని పుష్కలంగా కలిగి వున్నాయి కాబట్టి, మన శరీరాలపై ప్రసరించి శుభాన్ని కలిగిస్తాయి. తూర్పు దిశగా నిర్మించిన గృహాలలోకి ఉదయిస్తున్న సూర్యకిరణాలు లోపలి గదుల వరకూ వ్యాపిస్తాయి. అలా అందరూ పొద్దెక్కె వరకు సోమరిలా నిద్రపోయే సమస్యను సైతం సూర్యకిరణాలు పారద్రోలి పెందలకడే మనల్ని నిద్రలేపుతాయి.

కూర్చుని ఒక వ్యక్తి కాళ్ళూ ఎందుకు ఊపరాదు?


సంప్రదాయ విశ్వాసము ప్రకారము ఒక ఎత్తైన దానిపై కూర్చొని కాళ్ళు ఊపిన వారి తల్లిదండ్రులు ఆర్థిక ఇబ్బందుల్లో లేక అప్పుల్లో కూరుకుంటారు. ఈ నిషేధం ప్రధానంగా పిల్లపై పూర్వకాలంలో విధించబడింది.

మొండి పిల్లలు ఈ విశ్వాసంలో అర్థం లేదని తమ పెద్దలతో అంటుంటారు. కానీ పెద్దలు తాము ఇతరుల ద్వారా విన్నదాన్నే చెప్పడం జరుగుతుంది.

ఈ విశ్వాసం మూఢంగా కనిపించినా, ఓ వాస్తవం కనిపొస్తోంది. అదేమిటంటే అలా పిల్లలు కాళ్ళను ఊపడం ద్వారా ఎంతో శక్తిని కోల్పోతారు.  ఇది ఈ విశ్వాసానికి ఒక కారణం.  మరో కారణం ఏమిటంటే పూర్వకాలంలో ఔషదాలు ఉంచిన పెట్టెలు, కాసుల పెట్టె, నూనెలు ఉంచిన పాత్రలు మొదలైన వస్తువులు నానమ్మ తాతలు మంచాల క్రింది దాచేవారు. వారికి తమలపాకులు, వక్కునమిలే అలవాటు ఉండేది. కాబట్టి ఉమ్మిని ఉమ్మే పాత్రలు కూడా మంచాల క్రింద ఉంచేవారు. ఒక వేళ పిల్లలు ఆ మంచాలపై కూర్చొని కాళ్ళూ ఊపినట్లయితే, మంచం క్రింద ఉన్న పాత్రలను లేదా వస్తువులను తన్ని విరగగొట్టాడమో, పగులగొట్టాడమో లేక దొర్లించడమో జరిగేది. ఆ కారణాల వల్ల పిల్లలపై ఇలాంటి నిషేధం పెట్టారు.

పెద్దల మాట వినని పిల్లలు, విలువైన వస్తువులను, మట్టి పాత్రలను  కాళ్ళు ఊపుతూ తన్ని పగులగొడుతుండేవారు. తద్వారా ఈ ధన నష్టం వారి కుంటుంబానికి అప్పును కలిగించవచ్చు.  తల్లిదండ్రుల అప్పుల పిల్లల్కు కూడ వర్తించేవి కాబట్టి కుటుంబ క్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఇలా ఎత్తైన వాటిపై కూర్చొని కాళ్ళు ఆడించరాదని పెద్దల మంచిమాట, అలాగే ఈ అలవాటు శక్తిని కూడా హరిస్తుంది.