Wednesday, November 12, 2014

స్త్రీలకు ధర్మశాస్త్రం చెప్పేది

సుమంగళి స్త్రీలు నెత్తిన కుంకుమ లేకుండా ఎప్పుడు వుండకూడదు
రెండు చేతులతో తల గీరుకోరాదు
అయినదానికీ కానిదానికి ఎప్పుడు కంట నీరు పెట్టుకోరాదు. ఇది దారిద్ర్యమును తెచ్చిపెట్టును
ఒక ఆకులో వడ్డించిన దానిని తీసి మరియొక ఆకులో వడ్డించ కూడదు
ఇంటికి వచ్చిన సుమంగళి స్త్రీలకు పసుపు, కుంకుమ, తాంబూలాదులు విధిగా ఇచ్చి సత్కరించ వలెను
గర్భిణి స్త్రీలు టెంకాయ పగులకొట్ట రాదు. టెంకాయ కొట్టే స్థలంలో కూడా వుండ కూడదు
గర్భిణి నిమ్మకాయను కోసి దీపము వెలిగించ కూడదు
గర్భిణి స్త్రీలు గుమ్మడి కాయ కొట్టకూడదు
సూర్యోదయాత్ పూర్వమే ఇంటి ముందు కల్లాపు చల్లి ముగ్గు వేయడం లక్ష్మి కటాక్షము. ఇంటిలో ఈ పని చేయడానికి మనిషి ఉన్న ఇంటి యజమానురాలు చేయడం లక్ష్మి లోగిలోకి రావడానికి దోహదం
చేతితో ఎప్పుడు అన్నం, ఉప్పు, కూరలు వడ్డించకూడదు
ఏ వస్తువు అయిన ఇంట్లో లేకపోతే లేదు అనకుండా తీసుకురావాలి లేక నిండుకుంది అనడం సబబు. నాస్తి నాస్తి అంటుంటే మనకు అన్ని నాస్తిగానే అవమని అశ్వినిదేవతలు మరియు తథాస్తు దేవతలు కూడా పలుకుదురు

మంగళవారం గోళ్ళు తీయడం నిషిద్ధం

ప్రత్యేకించి మంగళవారం గోళ్ళు తీయడం నిషిద్ధం. శుక్రవారం లక్ష్మీప్రదం అని చెప్పి మనవాళ్ళు శుక్రవారం కూడా వద్దు అని అన్నారు. సోమ, బుధ, గురు, శుక్రవారములు క్షౌరానికి ప్రశస్తం. శని ఆది వారాలు మధ్యం. మంగళవారం నాడు నింద్యము. క్షౌరానికి గోళ్లకు సంబంధమేమిటి అంటే క్షౌరకర్మ చేయించుకున్నప్పుడే (ఆధునిక భాషలో చెప్పాలంటే cutting) గోళ్ళు తీసుకోవాలి. గోళ్ళు మనదేహంలోని మృతకణాలకు ప్రతీక. కణ విభజన (Metabolism) నిరంతరం కొనసాగే ప్రక్రియ. ఇందులో మృతకణాలు కొన్ని జుత్తుగా, మరికొన్ని గోళ్లుగా పెరుగుతాయి. కనుక వీటిని తొలగించడం కూడా ఒక ప్రత్యేకమైనటువంటి చెప్పబడిన తిథులలో, వారాలలో సమయాలలో మాత్రమే తొలగించాలి. స్నానానికి పూర్వమే తొలగించాలి. గోళ్ళతో యే వస్తువును త్రుంచకూడదు. ఇంటిలోకాకుండా ఇంటిబయట తొలగించుకోవాలి. అసలు జీర్ణం కాని పదార్థం ఏదైనా ఉందా అంటే వెంట్రుక. అలాగే గోళ్ళు కూడా. కనుక గోళ్ళు ఇంట్లో తీయడం దరిద్రం అని ఎందుకు అన్నారంటే దానిని తొక్కినా, అన్నంలో కలిసినా సమస్యలొస్తాయి. మానవుడు ఆచరించే పాపాలు అధికం జుత్తును, గోళ్లను ఆశ్రయించి ఉంటాయి. కనుక వీటిని తొలగించడానికి ఇంత నేర్పరితనం కావాలి. గోళ్ళను పెంచుకోకూడదు. దీనికి ఒక కథ ఉంది వేదంలో. పాపాలన్నీ సూర్యుడి దగ్గరికి పోయాయి. మీరు నాదగ్గర ఉండకూడదు తిరిగిపోండి అన్నాడాయన. ఎక్కడికి పోవాలి? అని ఆ పాపాలు సూర్యుడిని అడిగితే గోళ్ళను ఆశ్రయించండి అన్నాడట. దీనిని ఆధారంగా గోళ్ళు పెంచుకోకూడదు అని నియమం పెట్టారు.

ఉదయం లేవగానే

కరదర్శనం :- కరాగ్రే వసతే లక్ష్మీ కరమధ్యే సరస్వతి / కరమూలే స్థితాగౌరి ప్రభాతే కరదర్శనం //
చేయి పైభాగాన లక్ష్మీ, మధ్యభాగమున సరస్వతి, చివరిభాగమున గౌరీదేవి వున్నందున ప్రాతః కాలమున ఈ శ్లోకం చదివి మన రెండు చేతులను కళ్ళకు అద్దుకోవలెను.
లేదా
మూడుసార్లు శ్రీహరి, శ్రీహరి శ్రీహరి అని తలస్తూ కరదర్శనం చేసుకోవలెను)

భూప్రార్ధన :- సముద్ర వసనే దేవి పర్వతస్తన మండలే / విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్యమే //
పాదస్పర్శతో భూదేవిని బాధిస్తున్నందుకు క్షమాపణ చెప్తూ కాలిని నేలకు ఆన్చాలి.
లేదా
పాదస్పర్శ క్షమస్వమే, భూదేవి నమోస్తుతే అనైన ప్రార్ధించవచ్చును)

ప్రాతః స్మరణ :- బ్రహ్మ మురారి స్త్రిపురాంతకశ్చ, భాను శ్శశీ భూమిసుతో బుధశ్చ / గురుశ్చ శుక్ర శ్శని రాహు కేతవః, కుర్వంతం సర్వే మమ సుప్రభాతమ్ //
త్రిమూర్తులు, సూర్యచంద్రులు, నవగ్రహాలు నాకు మేలు చేయుదురుగాక!
లేదా
హరం హరిం హరిశ్చంద్రం హనూమంతం హలాయుధమ్ / పంచకం వై స్మరేన్నిత్యం ఘోరసంకటనాశనమ్ //

స్నాన విధి :- గంగే చ యమునే చైవ కృష్ణే గోదావరి సరస్వతి / నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు //
లేదా
యో సౌ సర్వగతో విష్ణు: చిత్ స్వరూపీ నిరంజనః / స ఏవ ద్రవరూపేణ గంగాంభో నాత్ర సంశయః //

(భాహ్యాభ్యంతరభేదేన శౌచం తు ద్వివిధం స్మృతమ్ / మృజ్జలాభ్యాం బహిశుద్ధి ర్భావశుద్ధి స్తదాన్తరమ్ //
బాహ్యాభ్యంతర భేదములచే శౌచం రెండువిధములుగా వుండును. జలముచే కలిగెడుశుద్ధి బాహ్యశుద్ది, నిర్మలభావము(భావశుద్ధి) చే కలిగెడుశుద్ధి అంతర శుద్ధి).

ఆత్మను పరమాత్మలో లయం చేయడానికి మన పూజావిధానం ఒక ఉతమోత్తమ మార్గం. దేవుని విగ్రహం లేదా చిత్రం విశ్వాత్మకు ప్రతిబింబం. విగ్రహం భూతత్వమైనది. అలానేసాంబ్రాణి ధూపం భూతత్వమైన వాసన కల్గివుంటుంది. ఇవి మూలాధారచక్రమును ఉత్తేజితం చేస్తుంది. అలానే తీర్ధ ప్రసాదాలు రుచి ద్వారా స్వాదిష్టానాన్ని ఉత్తేజితం చేస్తుంది. దీపం, హారతి ద్వారా జనించిన అగ్ని మణిపూరచక్రమును, గంధం, అగరబత్తిల ద్వారా వాయుతత్వమైన అనాహతచక్రమును, గంటానాదం ద్వారా విశుద్ధిచక్రం ఉత్తేజితం అవుతాయి. తద్వారా ఆజ్ఞాచక్రం, సహస్రారం జాగృతం అవుతాయి. ఇట్లా మనలోని నాడీకేంద్రాలను జాగృతం చేసుకోవడానికి పూజావిధానాన్ని ప్రాచీన మహర్షులు మనకందించారు. మంత్రాలు, ప్రార్ధనలు, సంకీర్తనలు, అర్చనలు, పూజలు ద్వారా మన షట్చక్రాలను మేలుకొల్పి కుండలినీశక్తిని పైకి నడిపి సహస్రారంలో గల పరమాత్మతత్వాన్ని ఆరాదిస్తున్నాం.

పూజావిధం :- చిత్రం, మృత్తిక, శిల, దారువు, లోహం.... దేనితో తయారైనదైనా దానిని భగవంతుని ప్రతిరూపముగా భావించి పూజిస్తాం. [ఈ రూపాలు మన ప్రగాడ విశ్వాసభావనతో ఏర్పరుచుకున్నవి]
{న తే రూపం న చాకారో నాయుధాని న చాన్పదమ్ / తధ్కాపి పురుషాకారో భక్తానాం త్వం ప్రకాశాసే //
భగవంతునికి ప్రత్యేకముగా ఒక్క రూపముగాని, ఒక్క ఆకారముగాని, ఆయుధముగాని (శంఖు,చక్ర,డమరు మొదలగు), వైకుంఠ కైలాసాది ప్రత్యేక స్థలములుగాని లేనప్పటికిని భక్తవత్సలగుటచేతను, పరమకరుణాస్వరూపులగుటచేతను భక్తులయొక్క భావమును అనుసరించి అనేకరూపములను ధరించుచున్నారు.
యే యధా మాం ప్రవద్యంతే తాంస్తదైవ భజామ్యహం ..... ఎవరు ఎలాంటి భావముతో నన్ను ఉపాసింతురో వారికాలాంటి భావముతో దర్శనమిత్తును.}

దీపస్తుతి :- దీపం జ్యోతి: పరబ్రహ్మ దీపం సర్వ తమోపహమ్ / దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీపం నమోస్తుతే //
దీపజ్యోతే పరబ్రహ్మం. దీపజ్యోతే అన్ని తమో గుణాలని హరించేది. దీపం వల్లే సర్వం సాధ్యం. సంధ్యలో వెలిగే దీపానికి నమస్కారాలు. [దీపకాంతిలో తమోరజో గుణాలు హరిస్తాయి]

నమస్కారం :- పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాపసంభవః / త్రాహి మాం కృపయా దేవ శరణాగతవత్సల //
తలవంచి రెండు చేతులు జోడించి హృదయం వద్దగానీ, భ్రూమధ్యంలో గానీ, నెత్తి పై అంటే సహస్రారంపై గానీ పెట్టి నమస్కరించడానికి కారణం ఏమిటంటే - మూడు ప్రదేశాలలో భగవంతుని భావన విశేషంగా ఉంటుంది. హృదయంలో ఆత్మరూపములో, భ్రూమధ్యంలో జీవరూపములో, సహస్రారంలో పరమాత్మరూపములో ఉంటుంది.
'న' అంటే లేదు, 'మ' అంటే నాది అయినటువంటిది అని అర్ధం. నమః అంటే నాదంటూ ఏదిలేదని అర్ధం. భగవంతున్ని నమష్కరించడం అంటే నాదంటూ ఏదిలేదని, ఉన్నదంతా నీదే (పరమాత్మదే) అని శరణాగతి భావమును తెలపడం.

పూజకు వినియోగించే పదార్దముల అంతరార్ధం :- కృష్ణభగవానుడు చెప్పిన పత్రం, పుష్పం, ఫలం, తోయంలకు అర్ధమేమిటంటే - పత్రం అంటే దేహం. ఈ శరీరమును వినియోగిస్తూ చేసే క్రియలను భక్తిభావముతో కృష్ణార్పణం చేయాలి.(ప్రారబ్ధకర్మనుండి విముక్తి కల్గుతుంది) పుష్పం అంటే హృదయం. పుష్పములా సున్నితముగా, సువాసనభరితంగా, స్వచ్ఛముగా వున్నా హృదయమును సమర్పించాలి. ఫలం అంటే కర్మఫలం. ఫలములో విత్తనములు వుంటాయి, అవి నాటితే తిరిగి చిగురిస్తాయి. అలానే కర్మల వలన జన్మించాల్సివస్తుంది. అలానే కర్మఫలాన్ని అనుభవించాల్సివస్తుంది. అలా కాకుండా త్రికరణశుద్ధిగా కర్మఫలాన్ని ఈశ్వరార్పణం చేస్తే కర్మబంధం తప్పుతుంది.(దీనివలన సంచిత, ఆగామి కర్మలనుడి విముక్తికల్గుతుంది) తోయమనగా భక్తిరసం. ఆరాధనతో, ఆర్తితో పరిపూర్ణ శరణాగతి భక్తిభావముతో మనస్సు ఉప్పొంగికార్చే ఆనందభాష్పాలను సమర్పించాలి.
కొబ్బరికాయ :- కొబ్బరికాయ కొడుతున్నామంటే మన అహంకారమును వీడుతున్నామని. కొట్టిన కొబ్బరిచెక్కలను భగవంతునికి సమర్పించడమంటే - లోపలున్న తెల్లనికొబ్బరిలా మన మనస్సును సంపూర్ణముగా భగవంతుని ముందు పరిచామని. తద్వారా నిర్మలమైన కొబ్బరినీరులా మన జీవితాలని వుంచమని అర్ధం. కొబ్బరి బయటిభాగం మన శరీరమని, లోపలభాగం మన మనస్సని, మూడుకళ్ళు ఇడా,పింగళ, సుషమ్ననాడులని కూడా పెద్దలు చెప్తారు. అలానే కొబ్బరికాయపై పీచును తమోగుణమునకు ప్రతీకగా, గట్టిగా ఉండే టెంక రజోగుణమునకు ప్రతీకగా, లోపల ఉన్న తెల్లని కొబ్బరిని సత్వగుణమునకు ప్రతీకగా విశీదకరిస్తూ, మనలో ఉన్న త్రిగుణములను బద్దలుకొట్టి పావనమైన అంతఃకరణమును కొబ్బరినీరుగా భగవంతునికి అర్పించడమనే అర్ధాని కొందరు చెప్తారు. 


ధూపం
:- సువాసనభరితమైన ధూపం మనలో వున్న చెడువాసనలను తొలగించాలని వెలిగిస్తాం.


హారతి స్తుతి :- ఆరోగ్యం ఆయుష్యం అనంతసౌఖ్యం
సంపత్సముర్ధ్యం శుభసన్నిధానం
కర్పూరదీవేన లభస్త్యదేహి
నీరాజనయే వేంకటనాధ నిత్యమ్.మనలోనికి
కర్మవాసనలన్నియు కర్పూరముల పూర్తిగా క్షయింపబడాలని. ఏ శేషములేకుండా భగవంతుని ముందు వెలిగించిన హారతి భగవంతునిలో కైకర్యం చెందినట్లుగా భక్తిభావంతో మనలోవెలుగుతున్నఆత్మ పరమాత్ముని యందు ఐక్యంకావాలని కోరుకోవడం. హారతిని కళ్ళకు అద్దుకోవడమంటే మన దృష్టి అంతర్ముఖం కావాలని. 


గంట :- మనస్సు ఎన్నో విషయాలు (జ్ఞాపకాలు, ఆలోచనలతో) తో నిండి ఉంటుంది. వాటన్నింటిని విడిచి కొన్ని క్షణములైన దైవమందు మనస్సు నిల్పవలయునని ఉద్దేశ్యంతో గంటను పుజాసామగ్రిలో ఓ భాగంగా పూర్వీకులు ప్రవేశపెట్టారు. ఘంటారావం వినగానే అనేక విషయాలయందు తిరిగే మనస్సు ఆ నాదమందైక్యమై నాదం ఏకస్థాయికి వచ్చునట్లు మనస్సు కూడా ఏకస్థాయికి వచ్చును అని పెద్దలు చెప్తారు. ఘంటానాదం నిశ్చబ్ధ స్థితిలోకి తీసుకువెళ్ళి, మన మనస్సును నిజ తత్వమైన ఆత్మవైపు కాసేపైన మళ్ళిస్తుంది. శబ్దంలోనుంచి నిశ్శబ్ధం, శూన్యంలోకి వెళ్ళమని గంట సూచిస్తుంది.


నైవేద్య నివేదన శ్లోకం :- త్వదీయం వస్తు గోవింద తుభ్యమేవ సమర్పయే /తేన త్వదంఘ్రి కమలే భక్తిం మే యచ్చ శాశ్వతీం
గోవిందా! నీ వస్తువులు నీకే సమర్పిస్తున్నాను. వీనితో నీ చరణకమలాలపై శాశ్వతమైన భక్తి కలుగునట్లు ప్రసాదించు.

ప్రదక్షిణ స్తుతి :- యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ / తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే //
ప్రదక్షిణ అనగా నేను అన్నివైపుల నుండి నిన్నే కాంచుతూ నిన్నే అనుసరిస్తూ ధ్యానిస్తున్నానని అర్ధం. 'ప్ర' అనగా పాపాల నాశనమని, 'ద' అనగా కోరికలు తీర్చమని, 'క్షి' అనగా మరు జన్మలో మంచి జన్మ ఇవ్వమని, 'ణ' అంటే అజ్ఞానం పారద్రోలి ఆత్మజ్ఞానమును ఇవ్వమనే అర్ధమును కొందరు చెప్తారు. 


దివ్యమంగళకరమగు భగవద్విగ్రహంను దర్శిస్తూ నేతేన్ద్రియములు భక్తిత్వంలో లయించును. సుగంధ ధూపవాసనలచే ఘ్రానేన్ద్రియం లయించును. ఓంకారం, గంటానాదం, శంఖారావం, మంత్రోచ్చారణలయందు కర్ణేన్ద్రియములు లీనమగును. భాగావన్నామోచ్చారణల చేతను, తీర్ధాది ప్రసాదముల చేతను జిహ్వేంద్రియం లయించును. పరిమిళమిళిత శీతలదాయకమగు పసుపుకుంకుమ చందనాదులచే త్వగింద్రియం శాంతంనొంది పవిత్రభావాలతో పులకరించును. పంచేంద్రియములు ఇలా ఒకే ధ్యాసతో భక్తిభావంనందు లయమైనప్పుడే మనస్సు కూడా పూర్తిగా ఏకాగ్రతతో యందు లయించును.


సూర్య స్తుతి :
- ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మామ భాస్కర / దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే //
లేదా
సప్తాశ్వరధ మారుడం ప్రచండం కశ్యపాత్మజమ్/ శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్ //
లేదా
త్రైగుణ్యం చ మహాశూరం బ్రహ్మ విష్ణు మహేశ్వరమ్ / మహాపాపహారం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్ //


తులసి స్తుతి:- యన్మూలే సర్వతీర్ధాని యన్మధ్యే సర్వదేవతాః / యదగ్రే సర్వవేదాశ్చ తులసీం త్వాం నమామ్యహమ్ //
లేదా
ప్రసీద దేవదేవేశి ప్రసీద హరివల్లభే / క్షీరోదమాధనోద్భూతే తులసి త్వాం నమామ్యహమ్ //

నవగ్రహ స్తుతి :- ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయచ / గురు శుక్ర శనిభ్యశ్ఛ రాహవే కేతవే నమః //

గురు స్తుతి :- గురు బ్రహ్మా గురు విష్ణు: గురు దేవో మహేశ్వరః / గురు సాక్షాత్ పరంబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః //
లేదా
అఖండ మండలాకారం వ్యాప్తం యేవ చరాచరమ్ / తత్పదం దర్శితం యేవ తస్మై శ్రీ గురవే నమః //
లేదా
అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా / చక్షురున్మీలితం యేవ తస్మై శ్రీ గురవే నమః //

భోజనమునకు ముందు
:- (ఏది భుజించినను భగవంతుని ప్రసాదముగానే స్వీకరించాలి)
అన్నపూర్ణే సదాపూర్ణే శంకరప్రాణవల్లబే / జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్ధం భిక్షాం దేహి చ పార్వతి //
లేదా
అన్నం బ్రహ్మరసో విష్ణు: భోక్తా దేవో మహేశ్వరః / ఇతిస్మరన్ ప్రభుం జానః దృష్టి దోషై: నలిప్యతే //
మరియు
బ్రహ్మార్పణం బ్రహ్మ హవిర్బ్రహ్మాగ్నౌ బ్రహ్మణా హుతమ్ / బ్రహ్మైవ తేవ గంతవ్యం బ్రహ్మకర్మసమాధినా //
మరియు
అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః / ప్రాణాపానసమాయుక్తః పచామ్యన్నం చతుర్విధమ్ //

భోజనము తర్వాత
:- అగస్త్యం కుంభకర్ణంచ శమ్యంచ బడబానలమ్ / ఆహారపరిణామార్ధం స్మరామి చ వృకోదరమ్ //
మరియు
విష్ణు: సమస్తేంద్రియ దేహదేహీ ప్రదానభూతో భగవాన్ యధైకః / సత్యేన తేనాత్త మశేష మన్నం ఆరోగ్యదం మే పరిణామ మేతు //

ప్రయాణం విధి :- జలే రక్షతు వారాహః స్థలే రక్షతు వామనః / అతవ్యాం నారసింహశ్చ సర్వతః పాతుకేశవః //
నీటిబాధనుంచి వరాహావతారం, భూ సంబంధమైన బాధలనుంచి వామనావతారం, అడవుల్లోని బాధలనుంచి నరసింహావతారం, అన్ని బాధలనుంచి అన్ని అవతారాలకి మూలమైన శ్రీహరి రక్షించుగాక!
లేదా
వనమాలీ గదీ శారజ్ఞి శంఖీ చక్రీ చ నందకీ / శ్రీమాన్ నారాయణో విష్ణు: వాసుదేవోభిరక్షతు //
లేదా
ఆపదా మపహర్తారం దాతారం సర్వసంపదామ్ / లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం //

కార్యసిద్ధి :- వినాయకం గురుం భానుం బ్రహ్మ విష్ణు మహేశ్వరాన్ / సరస్వతీం ప్రణమ్యాదౌ సర్వకార్యార్ధ సిద్ధయే //

స్మృతి సిద్ధి :- శ్రీదత్తో నారదో వ్యాసః శుకశ్చ పవనాత్మజః / కార్తవీర్యశ్చ గోరక్షో సప్తైతే స్మృతిగామినః //
(అనుకున్నది సిద్ధించడానికి, జ్ఞాపకశక్తి పెరగడానికి)

చంద్ర దర్శన స్తుతి
:- క్షీరార్ణవ సముత్పన్న లక్ష్మీప్రియ సహోదర / మహేశమకుటాభాస్వన్ బాలచంద్ర నమోస్తుతే //

గోవు దర్శన స్తుతి :- గావో మే చాగ్రతో నిత్యం గావః పృష్ఠత ఏవ చ / గావో మే హృదయేచైవ గవాం మధ్యే వసామ్యహమ్ //
మరియు
మంగళం దర్శనం ప్రాతః పూజానం పరమం పదమ్ / స్పర్శనం పరమం తీర్ధం నాస్తి ధేనుసమం క్వచిత్ //

ఔషద విధి :- ధన్వంతరిం గురుత్మంతం ఫణిరాజం చ కౌస్తుభమ్ / అచ్యుతం చామృతం చంద్రం స్మరే దౌషధకర్మణి //
లేదా
శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కళేబరే / ఔషదం జాహ్నవీతోయం వైద్యో నారాయణో హరి: //
లేదా
అచ్యుతానంత గోవింద నామోచ్చారణ భేషజాత్ / నశ్యంతి సకలా రోగాః సత్యం సత్యం వదామ్యహమ్ //

శయనవిధి :- రామం స్కంధం హనుమంతం వైనతేయం వృకోదరం / శయనే యః స్మరేన్నిత్యం దుఃస్వప్నం తన్న నశ్యతి //
లేదా
అగస్త్యో మాధవశ్చైవ ముచుకుందో మహాబలః / కపిలో ముని రాస్తీకః పంచైతే సుఖశాయినః //
లేదా
హనుమా నంజనాసూను: వాయుపుత్రో మహాబలః
రామేష్ఠ: ఫల్గునసఖః పింగాక్షోమిత విక్రమః
ఉదధిక్రమణశ్చైవ సీతాశోకవినాశకః
లక్ష్మణప్రాణదాతా చ దశగ్రీవస్య దర్పహా
ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః
స్వాపకాలే పఠే న్నిత్యం యాత్రాకాలే విశేషతః
తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్.

కుంకుమ ధారణ :- కుంకుమస్త్రీ పురుషులు ధరించడం మన సనాతన ఆచారం. ఇది తప్పనిసరి. ఎందుకంటే - రెండు కనుబొమలకు మద్యభాగమైన నుదుటిస్థానం 'ఇడ' 'పింగళ' 'సుషుమ్న' అనే ప్రధాన నాడుల సంగమస్థానం. కుంకుమ ధరించడం పవిత్రతకు, అస్తికత్వానికి, ధార్మికత్వానికి పురుషులకు సంకేతమైతే, స్త్రీలకు ఐదవతనానికి, సౌభాగ్యానికి, స్థిరబుద్ధికి సంకేతంగా చెప్తారు. కుంకుమ మనిషిలోని మనోశక్తిని, త్యాగతత్వాన్ని, నిర్భయత్వాన్ని, సహృదయతను పెంపొందిస్తుంది. మనం బొట్టు పెట్టుకునే చోటే అజ్ఞాచక్రం ఉంటుంది. దానికి త్రివేణి సంగమమని, అమృతస్థానమని పేరు. ధ్యానానికి ఇది ముఖ్యస్థానం. ఈచోట కుంకుమధారణ వలన పుష్టి, భక్తి, ఐశ్వర్యం మొదలైనవి కలుగుతాయి.

విజయాలకి భక్తి మార్గాలు

సాధారణంగా రోజూ చేసే పూజాదికాలతోపాటు, గ్రహస్థితి బాగా లేదని తెలిసినపుడు, ఆయా గ్రహాలకు జపాలు, శాంతులు చేయించాలని చెబుతారు. దాని వలన ఆ గ్రహ ప్రభావం తగ్గుతుందని కూడా అంటారు. అలాగే మనం ఏదైనా ఓ పని జరగాలని కోరున్నప్పుడు ఆ పని సవ్యంగా, ఎలాంటి ఆటంకాలు లేకుండా జరగాలంటే వివిధ దేవతా స్తోత్రాలు పఠించాలని చెబుతున్నారు పెద్దలు. ఏయే పనులకు ఏయే స్తోత్రాలు పఠించాలి, ఏ దేవతా పూజ చేయాలనే వివరాలు మీకోసం.

1. ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నపుడు మంచి అవకాశాలు రావాలన్నా, చేసే ప్రయత్నాలు ఫలించాలన్నా రోజూ సూర్యాష్టకం, ఆదిత్య హృదయం చదవాలి. సూర్యధ్యానం చేయాలి.

2. ఇక వ్యాపార ప్రయత్నాలు చేస్తున్నపుడు "కనకధారా స్తోత్రం" రోజు చదివితే ఆ వ్యాపారం అభివృద్ధి చెందుతుందట.

3. ఇక మంచి విద్య రావాలన్నా, చదువులో ఏకాగ్రత కుదరాలన్నా రోజూ " హయగ్రీవ స్తోత్రం" పిల్లలతో చదివించాలి. అలాగే "సరస్వతి ద్వాదశ నామాలు" చదువుకోమనాలి.

4. కుటుంబ వ్యక్తుల మధ్య మంచి సత్సంబంధాలకు " విష్ణు సహస్రనామం, లలిలా సహస్ర నామం పారాయణ చేయాలిట.

5. పిల్లలు కలగాలని కోరుకునే దంపతులు "గోపాల స్తోత్రం " చదివితే మంచిదట. అలాగే గర్భవతిగా వున్న స్త్రీ ఈ స్తోత్రాన్ని రోజు పఠిస్తే సుఖప్రసవం అవుతుంది అంటారు పెద్దలు.

6. ఇక వివాహానికి "లక్ష్మీ అష్టోత్తర పారాయణం" చెయ్యాలి. మంచి సంబంధం దొరికి, పనులన్నీ చక్కగా జరగాలని,పెళ్లితంతు సక్రమంగా జరగాలని సంకల్పించి ఈ పారాయణాన్నీ రోజు చేస్తే ఆ కోరికలు తీరుతాయట.

7. ఋణబాధలు ఇబ్బంది పెడుతుంటే రోజూ నవగ్రహ స్తోత్రం చదువుకోవాలిట. అలా చదివితే ఆ ఇబ్బందులలోంచి బయట పడతారుట.

8. ఇవే కాక ఇక ఇతర ఏ కోరికలు సిద్ధించాలన్నా విష్ణు సహస్ర నామ పారాయణ చేస్తే చాలు ఆ కోరికలన్నీ తీరుతాయట.

ఆహార నియమాలు



దేవుడికి నివేదన చేయడానికి ముందు విస్తట్లో ఉప్పు వడ్డించకూడదని పండితులు చెబుతున్నారు. స్వామికి సమర్పించే విస్తట్లో ఉప్పు మాత్రం ప్రత్యేకంగా వడ్డించకూడదని వారు అంటున్నారు.

ఇక యోగశాస్త్రం ప్రకారం మనుష్యుని శ్వాసగతి 12 అంగుళాల దాకా ఉంటుంది. భోజనం చేసేటపుడు 20 అంగుళాల దాకా ఉంటుంది. మాట్లాడితే శ్వాసగతి ఎక్కువవుతుంది. కాబట్టి ఆయుష్షు తగ్గుతుంది. కనుక ఆహారం తీసుకునేటప్పుడు మాట్లాడకూడదు.

అలాగే త్రయోదశినాడు వంకాయ తినకూడదు. అష్టమి నాడు కొబ్బరి తినకూడదని, పాడ్యమినాడు గుమ్మడికాయ తినకూడదని, పురాణాలు చెబుతున్నాయి. దొండకాయ తింటే వెంటనే బుద్ధి నశిస్తుంది.

రాత్రి అన్నం తినేటపుడు దీపం ఆరిపోతే విస్తరాకునుగాని, పాత్రనుగాని చేతులతో పట్టుకొని సూర్యుణ్ణి స్మరించాలని దీపాన్ని చూసి మిగిలినది తినాలని అప్పుడు మరోసారి వడ్డించుకోవద్దని పెద్దలంటారు.

రాత్రి తింటూ ఉన్నప్పుడు తుమ్మితే నెత్తిపై నీళ్ళు చల్లడం, దేవతను స్మరింపచేయడం ఆచారంగా ఉంది. రాత్రి పెరుగు వాడకూడదు. ఒకవేళ వాడితే నెయ్యి, పంచదార కలిపివాడవచ్చు. ఇలా చేస్తే వాతాన్ని పోగొడుతుంది.

రాత్రిళ్లు కాచిన పెరుగును మజ్జిగపులుసు మొదలైనవి) వాడకూడదు. ఆవునేయి కంటికి మంచిది. ఆవు మజ్జిగ చాలా తేలికైనది. అందులో సైంధవలవణం కలిపితే వాతాన్ని పోగొడుతుందని, పంచదార కలిపితే పిత్తాన్ని పోగొడుతుందని, శొంఠికలిపితే కఫాన్ని పోగొడుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

నలుగురు కూర్చొని తింటూ ఉన్నప్పుడు మధ్యలో లేవకూడదు. తేగలు, బుర్రగుంజు, జున్ను, తాటిపండు మొదలైనవి వేదవేత్తలు తినరు. మునగ, పుంస్త్వానికి (మగతనానికి) మంచిదంటారు.

దృష్టిదోషం పోవడానికి ఇది చదవాలి.

అన్నం బ్రహ్మ రసోవిష్ణు: బోక్తా దేవో మహేశ్వర: ఇతి సంచింత్య భుంజానం దృష్టిదోషో నబాధతే అంజనీగర్భంసంభూతం కుమారం బ్రహ్మచారిణం దృష్టిదోషవివానాశాయ హనుమంతం స్మరామ్నహం||

అనగా అన్నం బ్రహ్మం, అన్నరసం విష్ణురూపమై ఉన్నది. తినువాడు మహేశ్వరుడు, ఇట్లా చింతిస్తే దృష్టిదోషం ఉండదని పండితులు అంటున్నారు.

భోజనము చేయునపుడు ఆచరించవలసినవి

ముందుగా కాళ్లూ,చేతులు, నోరు శుభ్రపరచుకొని బోజనమునకు కూర్చొన వలెను. భగవంతుని స్మరించ వలెను.

శ్లో: బ్రహ్మార్పణం బ్రహ్మ హవిర్ బ్రహ్మాగ్నౌ బ్రహ్మణా హుతం
బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధినా .

శ్లో:అన్న పూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణ వల్లభే
ఙాన వైరాగ్య సిధ్యర్థం భిక్షాం దేహీచ పార్వతీ.

శ్లో: అహం వైస్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః
ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం.

ఓం నమో నారాయణాయ.

ఔపోశనము ( భోజనమునకు ముందు )

ఓ భూర్భువస్సువః. తత్సవితుర్వరేణ్యం. భర్గోదేవస్య ధీమహి. ధియో యోనః ప్రచోదయాత్.

అని గాయత్రీ మంత్రమును చదువుతూ నీటిని అన్న పదార్థములపై చల్లాలి. తద్వారా ఆ పదార్థమును ఆవహించి యున్న భూతములు తొలగి పోతాయి.
తరువాత ఎడమచేతి మధ్యవేలును విస్తరాకు పై ఆనించ వలెను.

సత్యంత్వర్తేన పరిషించామి ( సూర్యాస్తమయము తరువాత అయితే - ఋత్వంత్వా సత్యేన పరిషించామి ) అని చెప్పి నీటిని అన్నము చుట్టూ సవ్యముగా పొయ్యాలి. తరువాత భోజన పాత్రకు దక్షిణముగా నిరు చల్లి కొద్దికొద్దిగా అన్నము తీసుకోని

ధర్మ రాజాయ నమః
చిత్రగుప్తాయ నమః
ప్రేతెభ్యో నమః

అనుచు బలులను తూర్పు అంతముగా సమర్పించవలెను.
అరచేతిలో నీటిని తీసుకోని
అమృతమస్తు. అని అన్నమును అభిమంత్రించ వలెను.
అమృతోపస్తరణమసి స్వాహా అని నీటిని తాగాలి.

కుడిచేతి బొటన వేలు మధ్య, ఉంగరం వేళ్లతో అన్నమును కొద్ది కొద్దిగా తీసుకుని క్రింది మంత్రమును చెప్తూ పంటికి తగుల కుండ మ్రింగ వలెను.

ఓం ప్రాణాయ స్వాహా.
ఓం అపానాయ స్వాహా.
ఓం వ్యానాయ స్వాహా.
ఓం ఉదానాయ స్వాహా.
ఓం సమానాయ స్వాహా.
ఓం బ్రహ్మణే స్వాహా.

మనకు ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమానములని పంచప్రాణములు కలవు. ఆ పంచ ప్రాణాత్మకమైన అగ్నికి ఆహుతులను సమర్పించుట ఇందు ఉన్న అంతరార్థము. పంటికి తగిలితే అది ఎంగిలి అవుతుంది.

తరువాత ఎడమచేతిని ప్రక్కన ఉన్న నీటితో కొద్దిగా తడిచేసుకుని శుభ్రపరచుకుని భోజనమును ముగించవలెను.

ఉత్తర ఔపోశనము ( భోజనము తరువాత )
నీటిని కుడి చేతిలొపోసుకుని అమృతాపిధానమసి. అని కొద్దిగా తాగి మిగిలిన నీటిని క్రింది మంత్రమును చదువుతూ అపసవ్యముగా ఉచ్ఛిష్ట అన్నము ( విస్తరాకు ) చుట్టూ పొయ్యవలెను.

రౌరవే2పుణ్యనిలయే పద్మార్బుద నివాసినాం అర్థినాముదకందత్తం అక్షయ్యముపతిష్ఠతు.
అనంతరము కాళ్లూ , చేతులు, నోరు శుభ్రపరచుకొని ఆచమనము చేయ వలెను.రెండు చేతులను గట్టిగా రాపిడి చేసి రెండు కళ్లను తుడుచు కొన వలెను. ఈరకముగా మూడు సార్లు చేయవలెను. తద్వారా కంటి దోషాలు తొలగి పోతాయి.

తతః శత పదాని గత్వా - వంద అడుగులు వేయవలెను. తరువాత

అగస్తిరగ్నిర్ బడబానలశ్చ భుక్తం మయాన్నం జరయంత్వశేషమ్.
సుఖం మమైతత్ పరిణామ సంభవం యచ్చ త్వరోగోర మమచాస్తు దేహః.

అంటూ పొట్టను ముమ్మారు నిమర వలయును. తద్వారా ఆహారము చక్కగా జీర్ణమగును.

ఆవు వెన్న (నవనీతము)

షడ్రుచులు అంటే ఆరు రుచులు. అవి తీపి, పులుపు, కారం, వగరు, ఉప్పు, చేదు రుచులు. ఈ రుచులతో కూడినపదార్ధములు తినిననచో మన శరీరములో షడ్రసములు ఉత్పత్తి అవుతాయి. యివి 1) మధురరసం (తీపి), 2) ఆమ్లరసం (పులుపు), 3)లవణరసం (ఉప్పు), 4) కటురసం (కారం), 5) తిక్తరసం (చేదు), 6) కషాయరసం (వగరు). ఈ షడ్రసములు సమపాళ్ళలో వున్నట్లయితేమన ఆరోగ్యం బాగు ఉంటుంది. ఎక్కువ తక్కువ లయినట్లయితే దానికి సంబంధించిన అనారోగ్యము వస్తుంది. ఉదా|| మధురరసంపెరిగినచో చక్కెరవ్యాధి, ప్రకృతిలో ప్రతి ఆహారపదార్ధములో ఏదో ఒక చుచి ఉంటుంది. కానీ నవనీతంలో ఒక విశుద్ధ గుణమున్నది. షడ్రచులలో ఏ రుచికి చెందని మాధుర్యమైన సాత్వికమైన మధురరసం  (ఇది మామూలు తీపి రుచి కాదు) నవనీతములో ఉన్నదవి.

నవనీతము విశుద్ధ వర్ణము కలది, సత్వగుణము కలది, శాంత రసము కలది, కనిపించే సూర్య కాంతికి, స్పటికమునకు నీటికి రంగులేదు.అలాగే రుచి చూసే వస్తువులలో వెన్నకు రుచిలేదు. వెన్నలో వున్న శాంతరసమందు మనస్సు, సత్వగుణమును శాంతిని, తన్మయత్వమును,ససమాధిని పొందుతుంది. అందుకే శ్రీకృష్ణు మనకు తెలియచేయుటకు నవనీతమును నోటినిండ తినేవాడు. నవనీత చోరుడు ఆయన.యిటువంటి నవనీతమును మనకు ప్రసాదించుచున్న గోవునకు జయమగు గాక.

సాధారణంగా ప్రతి ఇంట్లోనూ వెన్న, నెయ్యి తరచూ వాడుతుంటారు. మేధాశక్తిని, చురుకుదనాన్ని పెంచే శక్తిగల వెన్న వలన అనేక ప్రయోజనాలు, మరెన్నో సద్గుణాలు ఉన్నాయి.* మజ్జిగను చిలికి తీసిన వెన్న మధురంగా ఉండటమేగాక శరీరంలో ధాతువులను సమస్థితికి తీసుకువచ్చి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అంటే మెటబాలిజం అనే జీవన ప్రక్రియను శరీరం సక్రమంగా నిర్వర్తించుకునేలా చేస్తుంది. సులభంగా జీర్ణమవుతుంది. జఠర రసాన్ని పెంచి, జీర్ణకోశాన్ని క్రమబద్ధీకరిస్తుంది. పొడి దగ్గును అరికడుతుంది. వెన్న కొంచెం ఆలస్యంగా అరుగుతుంది. కానీ, బలవర్థకమయినది. కాలేయాన్ని బలంగా ఉంచుతుంది. చర్మరోగాలను దరిచేరనీయదు. పిల్లల చేత వెన్న తినిపిస్తే మేధాశక్తి పెరుగుతుంది.

* తాజా వెన్నలో విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఎ, బి, సి, డి విటమిన్లు ఉన్నందున ఎదిగే పిల్లలకు వెన్న చక్కని పౌష్టికాహారం. వెన్నలో లభించే కొవ్వు పదార్థం సులభంగా జీర్ణమై, బలాన్ని వృద్ధిపరుస్తుంది. ప్రతిరోజూ పెరుగును చిలికి వెన్న తీసి పిల్లలకు పెడితే మేధావంతులుగా, ఆరోగ్యంగా పెరుగుతారు. వెన్నను శరీరానికి మర్దనా చేసినట్లయితే చర్మానికి వర్ఛస్సును, మృదుత్వాన్ని ప్రసాదిస్తుంది. నీరసించే పిల్లలకు, బలహీనులకు, గుండె బలం తక్కువగా ఉన్నవారికి వెన్న అత్యుత్తమమయినది.

* ఆవు వెన్నకు, గేదె వెన్నకు చాలా తేడా ఉంటుంది. శరీరానికి అవసరమైన చమురు గుణాన్ని కలుగజేసి, చలువను, దృఢత్వాన్ని కలిగించడంలో ఆవు వెన్న అత్యుత్తమమయినది. గేదెవెన్న కంటే ఆవు వెన్న సులభంగా జీర్ణమవుతుంది. వాతము, పిత్తమును క్రమబద్ధీకరించి, రక్తదోషము, క్షయ, మూలవ్యాధులను నివారించడంలో ఆవు నెయ్యి విశిష్టమైనది. అంతేగాక, ఈ రెండు రకాల వెన్న బలాన్ని, వీర్యవృద్ధిని, వర్ఛస్సును కలుగజేస్తాయి.

* వెన్నలో పంచదార కలిపి తీసుకుంటే కడుపులో మంట, పోట్లు సమసిపోతాయి. తేనె, చెరకురసం, ఉప్పు వెన్నకు విరుగుడు.

దేశీయ గోక్షీరం ఆరోగ్య ప్రదాయిని


1. కొంచెం, పలుచగా ఉండి త్వరగా అరుగుతుంది.
2. చిన్నపిల్లలకు తల్లిపాలతో సమానం.
3. మనిషికి చలాకీని పెంచుతుంది.
4. ఉదర సంబంధమైన జబ్బులు తగ్గుతుంది. ప్రేగులలోని క్రిములు నశించును.
5. జ్ఞాపకశక్తిని పెంచుతుంది.
6. చదువుకునే పిల్లలకు, మనస్సుతో పనిచేసే వ్యక్తులకు తెలివిని పెంచి వారిని నిష్ణా తులను చేస్తాయి.
7. మనస్సును, బుద్ధిని చైత న్యవంతం చేస్తాయి. సాత్విక గుణమును పెంచుతుంది.
8 ఆవుపాలలో మనకు మిక్కిలి మేలుచేసే బంగారు తత్వముతో కూడిన విట మిను 'ఎ' అధికంగా కలిగిన 'కెసీన్‌' అనే ఎంజైమ్‌ ఉన్నది. దీనివలన ఈ పాలు పసుపు పచ్చగా ఉంటాయి. ఇది రోగ నిరోధక శక్తిని బాగా పెంచు తుంది.
9. తెల్ల ఆవుపాలు వాతాన్ని, నల్ల (కపిల) ఆవు పాలు పిత్తాన్ని, ఎరుపురంగు ఆవుపాలు కఫాన్ని హరిస్తాయి.
10. ఆవుపాలు సర్వరోగ నివారణి.
11. ఆవుపాలు వృద్ధాప్యాన్ని దూరం చేస్తాయి.
12. ఘృతేన వర్ధతే బుద్దిః క్షీరేణాయుష్య వర్ధనం- ఆవునెయ్యి బుద్ధిబలాన్ని ఆయుష్షును పెంచుతుంది.
13. ఆవుపాలలో విషాన్ని హరించే శక్తి ఉంది.
14. మనం భుజించిన తేజో (అగ్ని) సంబంధమైన ఆవు నెయ్యి, నూనె, వెన్న, వగైరా లలోని స్థూల భాగం మజ్జ (మూలగ) గా మారుతుంది. సూక్ష్మభాగం వాక్కు అవు తుంది. ఆరోగ్యమైన ఎము కలు, మజ్జ (మూలుగ), మంచి సాత్వికం, శ్రావ్యం అయిన వాక్కు వీటి కోసం ఆవు నెయ్యి, వెన్న తప్పక తిఐ్వ.
15. ఆవునెయ్యి రక్తంలో మంచిదైన హెచ్‌డిఎల్‌ కొలెస్టరాల్‌ను పెంచి చెడుదైన ఎల్‌డిఎల్‌ కొలెస్టిరాల్‌ను తగ్గించును. హెచ్‌డిఎల్‌ కొలెస్టరాల్‌ గుండె జబ్బులు, అధిక రక్తపోటు రాకుండా కాపాడుతుంది.
16. భారతీయ గోవునకు మూపురం ఉంటుంది. ఈ మూపురం క్రింద ఉన్న వెన్నుపూసలో సూర్యశక్తిని గ్రహించగల దివ్యమైన ప్రాణశక్తితో కూడిన 'స్వర్ణనాడి' (సూర్యకేతు నాడి) అనే సూక్ష్మనాడీ ప్రవాహ శక్తి కేంద్రం ఉన్నది. సూర్య కిరణములు ఆవు మూపురముపై పడినపుడు ఈ స్వర్ణనాడి ఉత్తేజితమై సూర్య శక్తిని గ్రహించి బంగారు తత్వముతో కూడిన పసుపు పచ్చని 'కెసీన్‌' అనే ఎంజైమ్‌ను తయారు చేసి దానిని ఆవుపాలలో పెడుతుంది. అందువలన ఆవుపాలు, నెయ్యి, వెన్న పసుపుపచ్చని పసిమి రంగుతో ఉంటాయి. పాశ్చాత్య గోవులైన జర్సీ, హెచ్‌.ఎఫ్‌ వంటి గోవులకు మూపురం ఉండదు. అవి సూర్యశక్తిని గ్రహించలేవు. ఇవి శీతల ప్రదేశంలో చలికి తట్టుకొనే విధంగా పరిణామం చెందినవి. వీటికి మన దేశీయ ఆవుల వలె సూర్యశక్తిని గ్రహించగల స్వర్ణనాడి ఉండదు. అందు వలన వీటి పాలు మంచివి కావు. ఇవి కేవలం అధిక పాల ఉత్పత్తికై యాంత్రిక జీవులుగా మనం భావించ వచ్చును.
   
భారతదేశ ఉజ్జ్వల భవిష్యత్తు మూపురం ఉన్న ఆవు పై ఆధారపడి ఉన్నది. ఈ ఆవుపాలు చలాకితనాన్ని, తెలివిని, జ్ఞాపకశక్తిని, సత్వ గుణమును, బుద్ధిబలమును, ఓజస్సును పెంచును. ఓజస్సు మనిషి తెలివికి, ఆకర్షణ శక్తి కి వ్యాధి నిరోధక శక్తికి ప్రధాన కారణం.
ఆవునెయ్యి ఆరోగ్యకరమైన మంచి ఎముకలను, మంచి రక్తాన్ని ఉత్పత్తి చేయు మూలుగును, మంచి వాక్కును, మేధాశక్తిని, కాంతిని, బుద్ధిబలాన్ని పెంచును. విద్యార్థులకు జ్ఞాపకశక్తిని పెంచును. రక్తంలో చెడు కొలెస్టరాల్‌ అయిన LDL Cholesterol పెరగనివ్వదు. ఆవు నెయ్యి వలన ఉత్పత్తి అయిన మూలుగ నుండి మంచి రక్తం మంచి మూల కణ ములు (Stem cells) ఉత్ప త్తి అయి వ్రతిశరీర అవయ వమును శక్తివంతంగా ఉంచి వ్యాధి కారక క్రిములను Aidsను కలుగచేయు Virus క్రిములతో సహా) చంపివేసి, ఆరోగ్యమును కలుగచేయును. స్త్రీలలో ఎము కలు బలహీనమై Osteoporosis Arthritis అనే వ్యాధి రాకుండా ఉండు టకు, వచ్చిన వ్యాధిని తగ్గించుటకు, గర్భిణీ స్త్రీలు కాల్షియం పొందుటకు-కాల్షియం మాత్రల కన్నా ఆవునెయ్యి ఎంతో శ్రేష్ఠమైనది. స్త్రీ గర్భంలోని బిడ్డకు ఎముకల పుష్టికి, మేధాశక్తికి పునాది వేస్తుంది. ఈ జన్మలో నిత్యం తీసుకొనే ఆవుపాలు, ఆవుపెరుగు, ఆవునెయ్యి సూక్ష్మ అంశతో ఏర్పడే 'మనస్సు బుద్ధి' రాబోవు జన్మలో వారికి మంచి మేధాశక్తి, బుద్ధిబలాన్ని ప్రసాదిస్తుంది.

ఆవుపాల పెరుగు ప్రాముఖ్యత

ఆవుపాల పెరుగు ఆకలి కలిగిస్తుంది. జీర్ణశక్తిని పెంచి శక్తినిస్తుంది. పెరుగు లేదా దధి ఒక మంచి ఆహార పదార్ధము. మరిగించిన పాల లో గోరువెచ్చగా ఉండగా మజ్జిగచుక్కలను వేస్తే పాలు గట్టిగా తోడుకొంటాయి. దీనినే పెరుగు అంటారు. పెరుగు నుండి వెన్న,నెయ్యి లను తీస్తారు. పాలలో తోడు తక్కువ వేస్తే పెరుగు తియ్యగా ఉంటుంది. తోడు ఎక్కువైతే పెరుగు పుల్లగా ఉంటుంది. పెరుగు ఎలాంటి వాత వ్యాధినయినా జయిస్తుంది. ఇది బరువును పెంచుతుంది, శరీరానికి పుష్టిని కలిగిస్తుంది. ఆహారం మీద యిష్టం లేని వాళ్ళకి పెరుగు మంచిదని ఆయుర్వేదం చెబుతుంది.

మనం తెలుగులో దీనిని "పెరుగు" అంటాం. ఆంగ్లంలో "యోగర్ట్" అనీ హిందీలో "దహీ" అని అంటారు. ఏదైనా ఫెర్మెంటో పాలనే పెరుగు అనడం అర్థవంతంగా లేకపొయినా, పాలని పులవబెట్టడం వలన పెరుగవుతోందనేది అందరికీ తెలిసిందే. ఆరోగ్యాన్నివ్వటంలో పెరుగుని మించిన పదార్థం మరొకటి లేదు. ఆహార పదార్థాలలో దీనిని అమృతంగా పోలుస్తారు. విదేశాల్లో అయితే ఆవు పాలతోనే పెరుగు తయారుచేస్తారు. మన దేశంలో మాత్రం గేదె పాలతోనూ పెరుగు తయారుచెయ్యటం పరిపాటి.


పెరుగులో పోషకపదార్థాలు:
పోషక పదార్థం
విలువలు
నీటిశాతం89.1%
ప్రోటీన్3.1%
క్రొవ్వులు4%
మినరల్స్0.8%
కార్బొహైడ్రేట్స్3%
కాల్షియం149 మి.గ్రా
ఫాస్పరస్93 మి.గ్రా
ఇనుము0.2 మి.గ్రా
విటమిన్ - ఎ102 ఐ.యు
విటమిన్ - సి1 మి.గ్రా
* జలుబుగా ఉన్నపుడు పెరుగు బాగా పనిచేస్తుంది.

* మూత్ర సంబంధమైన రోగాల్లో కూడా పెరుగు ఉత్తమం.

* జిగురు విరేచనాలయ్యేవారికి పెరుగు బాగా పని చేస్తుంది.

* మీగడ తీసిన పెరుగు, పాలపై వెన్న తీసి తయారుచేసిన పెరుగు అత్యుత్తమమైన ఫలితాలనిస్తాయి.

* పెరుగులో పెసరపప్పు, శొంఠి, పంచదార , ఉసిరి కాయ పొడి చేర్చి తింటే అధికమైన ఉపయోగాలు పొందవచ్చునని ఆయుర్వేదం చెబుతుంది.

*అన్ని రకాల జ్వరాల్లో కూడా పెరుగును నిరభ్యంతరంగా వాడుకోవాలని ఆయుర్వేద సూచన.

* పెరుగులో తియ్యనిది, పుల్లనిది, బాగా పుల్లనిది అని మూడు రకాలు ఉంటాయని సుశృతుడు వివరించాడు. అలాగే పెరుగు వాడటం వలన శరీరానికి చాలా ఉపయోగం అని చరకుడు కూడా తెలిపాడు.

* పెరుగులో ఉండే పోషక విలువలు పాలలో ఉండే పోషక విలువలతో సమానంగా ఉన్నప్పటికీ, పెరుగులో ఉండే ప్రత్యేక గుణం దాన్ని ఆరోగ్యాన్నిచ్చే పదార్థాలలో ఉన్నత స్థానంలో ఉంచుతుంది. పాలు పెరుగుగా మారడానికి జరిగే ప్రక్రియలో బాక్టీరియా పాలలో ఉండే ప్రోటీన్ ని తేలికగా అరిగేలా చేస్తుంది. ఈ రకమైన మార్పు వలన పెరుగు త్వరగా జీర్ణం అవుతుంది.

* జీర్ణకోశంలో పెరిగే హానికర బాక్టీరియాలని పెరగనివ్వకుండా చేస్తుంది. అంతే కాకుండా మనకి "మంచి" చేసే బాక్టీరియాని పెరిగేలా కూడా చేస్తుంది. ఈ బాక్టీరియా పెరుగులో ఉండే మినరల్స్ త్వరగా రక్తంలో కలిసేలా చెయ్యడం , బి కాంప్లెక్స్ విటమిన్ ని తయారుచేయటం లాంటి పనులు కూడా చేస్తుంది.

* చర్మం నిగనిగలాడుతూ కనిపించేలా కూడా పెరుగు ఉపయోగపడుతుంది.

* ఎండ వేడికి చర్మం పాడవకుండా చేస్తుంది. చర్మానికి సరఫరా అయ్యే నరాలకి శక్తినిస్తుంది. పెరుగులో ఉండే బాక్టీరియా చర్మ పోషణకు ఉపయోగపడుతుంది.

* పెరుగులో నిమ్మరసాన్ని కలిపి ముఖానికి పై పూతగా పూస్తే చర్మం పై ఉండే మలినాలు త్వరగా కరిగిపోతాయి. చర్మంపై తేమ శాతం పెరుగుతుంది. కాంతివంతంగా తయారవుతుంది.

* ముఖంపై మొటిమలున్నవారికి పెరుగులో కొంచెం శనగ పిండి కలిపి ముఖానికి రాస్తే మొటిమలు తగ్గిపోతాయి.

* పెరుగు తలకి రాస్తే మంచి కండిషనర్ గా కూడా పనిచేస్తుంది. తలస్నానానికి ముందుగా పెరుగుని తలకి మర్థించి తర్వాత స్నానం చేస్తే సరిపోతుంది.

* చుండ్రు సమస్యతో సతమతమయ్యేవారు పెరుగులో కొంచెం ఉసిరికాయ పొడినికలిపి తలకి పట్టించి అరగంట తర్వాత స్నానం చేస్తే మంచి ఫలితాలు వస్తాయి.

** అలాగే ఆయుర్వేదం పెరుగును గురించి చెబుతూ రాత్రి వేళల్లో పెరుగు వేసుకోకూడదంటుంది. అలాగే పెరుగుని వేడి చేసి తినకూడదు.పూర్తిగా తోడుకోని పెరుగును కూడా తినవద్దని ఆయుర్వేదంలో ఉంది.  వేసవికాలం పెరుగును ఎక్కువ తీసుకోరాదు. అలాగే ప్రతిరోజూ తినకూడదు. 

ఆవు మజ్జిగ విశిష్టత



పెరుగుకు నాలుగురెట్లు నీళ్లు కలిపి చిలికి వెన్న తొలగిస్తే మజ్జిగ తయారవుతుంది. మజ్జిగలో కొవ్వును తొలగిస్తారు కనుక పెద్ద వయసువారికి మంచి చేస్తుంది.

మజ్జిగ మూడు దోషాలనూ తగ్గిస్తుంది. మజ్జిగను సైంధవ లవణంతో కలిపి తీసుకుంటే వాతాన్ని తగ్గిస్తుంది. మజ్జిగను పటిక బెల్లంతో కలిపి తీసుకుంటే పైత్యం తగ్గుతుంది. మజ్జిగకు శొంఠి, పిప్పళ్లు, మిరియాల చూర్ణం కలిపి తీసుకుంటే కఫం తగ్గుతుంది. ఆవు మజ్జిగ మూడు దోషాలను తగ్గిస్తుంది. పథ్యంగా, ఆకలిని పెంచేదిగా, రుచికారకంగా, బుద్ధివర్థకంగా పనిచేస్తుంది. గేదె మజ్జిగ కఫాన్ని పెంచుతుంది. అలాగే వాపును పెంచుతుంది.

**మజ్జిగను వాడకూడని సందర్భాలు కొన్ని ఉన్నాయి. ఉదాహరణకు జలోదరం (ఎసైటిస్), యకృద్‌వృద్ధి (హెపటోమెగాలి), ఉబ్బసం, దగ్గు, బ్రాంకైటిస్, నిమోనియా వంటి వ్యాధుల్లో మజ్జిగను వాడటం మంచిది కాదు.

* మజ్జిగలో ఇంగువనూ, జీలకర్రనూ, సైంధవ లవణాన్నీ కలిపి తీసుకుంటే పొట్ట ఉబ్బరింపు తగ్గుతుంది.

* పైల్స్ వ్యాధిలో మజ్జిగ బాగా పనిచేస్తుంది. మజ్జిగ పోసిన చోట గడ్డి మొలవదు. అలాగే మజ్జిగను ఎక్కువగా వాడేవారిలో పైల్స్ కూడా తయారుకావు.

* దురదతో కూడిన అర్శమొలలకు వెన్నతో కూడిన మజ్జిగ తీసుకోవాలి. మజ్జిగలో కొంచెం నిమ్మరసం కలిపి తీసుకుంటే మల విసర్జన తరువాత మల ద్వారంలో వచ్చే మంట తగ్గుతుంది.

* రక్తస్రావంతో కూడిన అర్శమొలకు వెన్న తొలగించిన మజ్జిగ తీసుకోవాలి. లేదా మజ్జిగలో ఉప్పు, వాముపొడి కలిపి తీసుకోవాలి. అలాగే మరో మంచి చికిత్స ఉంది. చిత్రమూలం వేరు బెరడును ముద్దగా దంచాలి. ఈ పేస్టును కుండలోపల పూసి, దానిలో మజ్జిగ చేసుకొని తాగాలి.

* పిప్పళ్లను వర్ధమాన యోగం రూపంలో మజ్జిగతో వాడాలి. అంటే పిప్పళ్లను పది రోజుల వరకూ రోజుకొకటి చొప్పున పెంచి తిరిగి తగ్గించుకుంటూ రావాలి.

* మూత్రంలో మంటకు మజ్జిగలో శుద్ధిచేసిన గంధకాన్ని కలిపి తీసుకోవాలి.

* చర్మంపైన మంటలకు మజ్జిగలో వాష్ క్లాత్‌ని ముంచి ఒళ్లు తుడుచుకోవాలి.

* సొరియాసిస్, ఎగ్జిమాకు చిక్కని మజ్జిగలో ఒక నూలు గుడ్డను తడిపి కొన్ని గంటలపాటు చర్మవ్యాధి ఉన్నచోట పరిచి ఉంచితే ఉపశమనం లభిస్తుంది.

* వేరుశనగ, నెయ్యి వంటి ఆహారాలతో ఎలర్జీలకు మజ్జిగకు కాస్తంత పసుపుచేర్చి తీసుకోవాలి.

* ఒంటికణత నొప్పికి అన్నంలో మజ్జిగ పోసుకొని కొంచెం బెల్లం కలిపి తినాలి. దీనిని సూర్యోదయానికి ముందే తీసుకోవాలి.

* విరేచనాలు: మజ్జిగలో వేయించిన జీలకర్ర పొడిని కలిపి తీసుకోవాలి. లేదా మజ్జిగలో తేనె కలిపి తీసుకోవాలి.

* మల ద్వారం చుట్టూ దురదకు మజ్జిగలో నిమ్మరసం కలిపి తీసుకోవాలి. దీనివల్ల మలంలోని ఆమ్లత్వం తగ్గి దురద తగ్గుతుంది.

* నులిపురుగులకు మజ్జిగలో వాయువిడంగాల చూర్ణం కలిపి తీసుకోవాలి.

* మాంసాహారం అరుగుదలకు మజ్జిగలో మాంసపు ముక్కలను నానేసి ఉడికించాలి. మజ్జిగలో ఊరటంవల్ల మాంసంలోని తంతువులు మార్ధవంగా తయారవుతాయి.

* పొడి చర్మం: మజ్జిగలో కొంచెం నిమ్మరసం కలిపి రాసుకొని సున్నిపిండితో స్నానం చేస్తే చర్మం నునుపుగా తయారవుతుంది.

*మజ్జికను వేసవికాలంలో దాహాన్ని తీర్చే చక్కని పానీయంగా ఉపయోగిస్తారు. దీనిలో కొంచెం కరివేపాకు, అల్లం, పచ్చి మిరపకాయలు వేసి కొంతసేపుంచితే ఇంకా రుచిగా ఉంటుంది. కొంతమంది చలివేంద్రంలో నీటితో సహా మజ్జిగను కూడా ఎండలో తిరుగుతున్నవారికి పంచుతారు.

కొలతలు - రకాలు